సౌందర్యంతోపాటు సౌకర్యానికీ ప్రాధాన్యమివ్వాలి
1 min readసౌందర్యంతోపాటు సౌకర్యానికీ ప్రాధాన్యమివ్వాలి!
పర్యావరణహిత, సుస్థిర నిర్మాణాలపై మరింతగా దృష్టిపెట్టాలి
భవిష్యత్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించాలి
నాగరికత సాధించిన విజయాల్లో నిర్మాణ కౌశల్యం (అర్కిటెక్చర్) కూడా ఒకటి
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో స్థానిక కళాకారులకు అవకాశం కల్పించాలి
ఐఐఏ జాతీయ సదస్సులో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
పర్యావరణహిత, సుస్థిర నిర్మాణాలపై భారతదేశ నిర్మాణరంగ నిపుణులు (ఆర్కిటెక్ట్ లు) మరింత దృష్టిపెట్టాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. భవన నిర్మాణరంగంలో సౌందర్యంతోపాటు సౌకర్యాన్ని సమ్మిళితం చేసి ప్రజల జీవితాలను మరింత ఆనందమయంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు తమవంతుగా కృషిచేయాలన్నారు.
శనివారం భారతీయ నిర్మాణరంగ నిపుణుల సంస్థ జాతీయ సదస్సు (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ నాట్‌కాన్ 2020 – ట్రాన్సెండ్) ను ప్రారంభించిన అనంతరం ఆన్‌లైన్ వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ‘నాగరికత సాధించిన విజయాల్లో నిర్మాణ కౌశల్యం కూడా ఒకటి. సింధు నాగరికత, తర్వాతి కాలంలో కోణార్క్ దేవాలయం మొదలుకుని.. ఆధునిక నిర్మాణాల వరకు భారతీయ నిర్మాణ విజ్ఞానంలో స్థానిక శిల్పుల నైపుణ్యత, వినియోగించిన సామాగ్రి, సాంకేతిక విజ్ఞానం పాత్ర చాలా ప్రత్యేకం. ఈ కట్టడాలే మన నిర్మాణరంగ కౌశలానికి నిదర్శనం’ అని పేర్కొన్నారు. నిర్మాణరంగంలో ఆత్మనిర్భరతను సాధించే క్రమంలో.. మన ప్రాచీన, సంప్రదాయ కట్టడాల వారసత్వ నిర్మాణశైలిలోని గొప్పదనాన్ని అవగతం చేసుకుని, పర్యావరణహితాన్ని మదిలో ఉంచుకుని ప్రజల అవసరాలకు సరిపోయే విధంగా నిర్మాణాలు చేపట్టడంపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టుల విషయంలో పునరుత్పాదక శక్తి వినియోగించడాన్ని కూడా ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ‘స్మార్ట్ సిటీస్’, ‘అందరికీ ఇళ్లు’ వంటి కార్యక్రమాలను ప్రశంసిస్తూ.. ఈ పథకాల అమల్లో భాగంగా.. ఆయా ప్రాంతాల్లోని సంస్కృతి, సంప్రదాయాలకు తగిన గౌరవం ఇవ్వాలన్నారు. ఇందుకోసం స్థానిక కళాకారులు, శిల్పుల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలన్నారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టే ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ స్థానికుల సలహాలు, సూచనలు తీసుకోవాలని.. వారి అవసరాలకు తగ్గట్లుగా ప్రాజెక్టులను పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
‘పట్టణాల్లో వర్షాకాలం వస్తే రోడ్లపై, కాలనీల్లో నీరు నిలిచిపోతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రభావవంతమైన డ్రైనేజీ వ్యవస్థ ద్వారా ఈ సమస్యలకు సరైన పరిష్కారాన్ని సూచించేందుకు ప్రయత్నించాలి’ అని ఉపరాష్ట్రపతి వారికి సూచించారు.
కరోనా మహమ్మారి కారణంగా ప్రజారోగ్యం, వారి జీవన విధానంతోపాటుగా.. నిర్మాణరంగం కూడా ప్రభావితమైందన్నారు. కరోనా తదనంతర పరిస్థితులు, సమస్యల పరిష్కారానికి వినూత్నమైన ఆవిష్కరణలకోసం చర్చించి మంచి ఫలితాలు సాధించేందుకు ఈ జాతీయ సదస్సు వేదిక కావాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.
***