జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలు
1 min readఅనంతపురం, నవంబర్ 2 :
అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలు ఇలా ఉన్నాయి.
భైరవాని తిప్ప ప్రాజెక్టుకు నీటిని సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలి : ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ భైరవాని తిప్ప ప్రాజెక్టుకు నీటిని సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉంతకల్ రిజర్వాయర్ కు నీటిసరఫరా కు ఉద్దేశించిన 36ఏ ప్యాకేజీ ఏమైంది, రాయదుర్గం నియోజక వర్గానికి నీళ్లు అందించే ప్యాకేజీ ఏమైనా ఉందా అని విప్ రామచంద్రా రెడ్డి ప్రశ్నించారు. రాయదుర్గం నియోజకవర్గం పట్ల నిర్లక్ష్య వైఖరి తగదని విప్ తెలిపారు.. నియోజకవర్గంలో ఇంతవరకు చెరువులకు నీరివ్వలేదని, నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కోవిడ్ మరణాలు ఎక్కువగా ఉన్న మండలాలపై దృష్టి పెట్టాలి : ఎంపీ తలారి రంగయ్య
కోవిడ్ మరణాలు ఎక్కువగా ఉన్న మండలాలపై దృష్టి పెట్టాలని ఎంపీ తలారి రంగయ్య కోరారు. పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో పత్తి పంట గత సంవత్సరం నుంచి నిల్వ ఉంది..ఈ ఏడాది వర్షాల వల్ల దెబ్బతినింది.. ఈ అంశంపై రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, పత్తి పంటకు ప్రాసెసింగ్ యూనిట్లు జిల్లాలో ఏర్పాటు చేయాలని, డ్రిప్, స్ప్రింకర్లను మంజూరు చేయాలని ఎంపీ రంగయ్య కోరారు. చాగల్లు, జీడిపల్లి రిజర్వాయర్లు కింద నిర్వాసితులకు పెండింగులో ఉన్న పరిహారాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ రంగయ్య కోరారు., కిసాన్ రైలు ఏర్పాటు, ఉద్యాన ఉత్పత్తుల రవాణా గురించి ఎంపీ వివరించారు.
పట్టు రైతులకు ప్రోత్సాహం అందించాలి : ఎంపీ గోరంట్ల మాధవ్
సెరికల్చర్ పరిధిలో పట్టు రైతులకు రూ.11 కోట్లు ప్రోత్సాహం పెండింగ్ లో ఉంది, మరియు కేజీకి ప్రోత్సాహం 50 రూపాయల నుంచి 150 రుపాయలకు పెంచాలని డిమాండ్ ఉంది. దాన్ని పరిశీలించాలని ఎంపీ గోరంట్ల మాధవ్ కోరారు.
సానిటరీ ఉద్యోగులకు పెండింగులో ఉన్న జీతాలు మంజూరు చేయాలి : ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి
ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి మాట్లాడుతూ సానిటరీ ఉద్యోగులకు పెండింగులో ఉన్న జీతాలు మంజూరు చేయాలని కోరారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ పైపులైన్ సమస్యను పరిష్కరించాలని కోరారు. కనీస మద్దతు ధర అందించడంలో భాగంగా రైతుల దగ్గర తక్కువ ధరకు పంట కొని.. సబ్సిడీ విత్తనాలు రైతులకు అందించే కార్యక్రమంలో భాగంగా కంపెనీల దగ్గర ఎక్కువకు కొనడం వల్ల లాభం కంపెనీలకు వెళ్తోందనీ… ఎక్కువ లాభం రైతులకు దక్కేలా చూడాలని కోరారు. వైఎస్సార్ పంటల బీమా లో ప్రస్తుతం ఉన్న నిబంధనలు సడలించి గ్రామం యూనిట్ గా తీసుకుంటే ఈ జిల్లా రైతులకు మేలు జరుగుతుందన్నారు.
ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ నగరంలో, పంచాయతీలలో దోమల బెడద ఉందని, బ్లీచింగ్ పొడర్ చల్లడం, ఫాగింగ్ జరగకపోవడం కుక్కల బెడద ఎక్కువగా ఉందని, దానిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మాట్లాడుతూ జీజీహెచ్ లో మరమ్మతులపై వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో నియమించిన డాక్టర్లకు జీతాలు చెల్లించలేదని, వెంటనే చెల్లించాలని కోరారు. హిందూపురం ఆస్పత్రిలో నర్సులు తక్కువగా ఉన్నారని, పూర్తి స్థాయి భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రెగ్యులర్ వైద్యసిబ్బంది నియామకాన్ని చేపట్టాలి : అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామి రెడ్డి
అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామి రెడ్డి ఎంసిహెచ్ బ్లాక్ ఏర్పాటుకు కావలసిన భూమిని ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రెగ్యులర్ వైద్యసిబ్బంది నియామకాన్ని చేపట్టాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సీటీ స్కాన్ పేరుతో పేదలను దోచుకుంటుండటంపై చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా టెస్టులు చేయాలని సూచించారు.. ప్రభుత్వమే రైతులకు బీమా కడుతోంది..ప్రస్తుతం అందిస్తున్న బీమా విధానంతో రైతులకు న్యాయం జరగడం లేదు..జిల్లాలో వేరుశనగ ఎక్కువ సాగు చేస్తారు.. అందువల్ల బీమా విధానాన్ని మార్చాలి..ఎప్పుడు పంట నష్టం జరిగినా గ్రామం ను యూనిట్ గా తీసుకుని బీమాను వర్తింప చేయాలి..ఈ అంశాన్ని ఎంపీ రంగయ్య, కదిరి, గుంతకల్లు ఎమ్మెల్యేలు పి.వి.సిద్దారెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి కూడా ప్రస్తావించారు. జిల్లాలో 50 నించి 60 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ ఉన్నాయి.. ఇందుకోసం 20 kv ,25 kv ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని కావాలో చెప్పాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి విద్యుత్ ఎస్ ఈ ను ప్రశ్నించారు. పి ఏ బి ఆర్ లో 5,6 టీఎంసీ లు నీటి నిల్వ వుండేలా చూడాలి.. జీడిపల్లి నుంచి పి ఏ బి ఆర్ కు 100 క్యూసెక్కుల నీరు వస్తోంది.. ఈ సామర్థ్యాన్ని 500 నుంచి 600 క్యూసెక్కులకు పెంచాలి..
జూన్, జులై లో వేసిన పంటలకు కూడా బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలి : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ లో పంట వేస్తేనే బీమా వర్తిస్తోందనీ, అలా కాకుండా జూన్, జులై లో వేసిన పంటలకు కూడా బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలి..డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సూక్ష్మ సేద్యాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
జలకళలో కొన్ని గ్రామాలు బ్లాక్ జోన్ లో ఉన్న విషయాన్ని చైర్ దృష్టికి తీసుకొచ్చారు. పెరిగిన గ్రౌండ్ వాటర్ ను దృష్టిలో పెట్టుకుని జలకళ బ్లాక్ లిస్టులో ఉన్న గ్రామాలను తొలగించాలని కోరారు. వైఎస్సార్ జలకళ కింద బోర్లు వేయడం వల్ల విద్యుత్ లోడ్ పెరిగే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా సబ్ స్టేషన్లు, ట్రాన్ఫార్మర్లు ఏర్పాటు చేయాలి. పి ఏ బి ఆర్ కుడి కాలువకు జీడిపల్లి నుంచి నీటినిచ్చేలా చర్యలు తీసుకోవాలి..
ప్రభత్వ ఆసుపత్రుల్లో శుభ్రత పెంచాలి : శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ ప్రభత్వ ఆసుపత్రుల్లో శుభ్రత పెంచాలి.. సింగనమల లో గర్భవతులకు స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు.
ఎమ్మెల్సీ ఇక్బాల్ శింగనమల ఎమ్మెల్యే అభిప్రాయాలను పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ స్వదేశీ విత్తనాల సంరక్షణ గురించి తీసుకున్న చర్యలపై వ్యవసాయశాఖ అధికారులను ప్రశ్నించారు. ఆర్గానిక్ ఫార్మింగ్, స్వదేశీ విత్తనాలను ప్రోత్సహించడం, మిల్లెట్స్(అపరాలు) ను ఎంకరేజ్ చేస్తేనే రైతుకు మేలు జరుగుతుందన్నారు. మిల్లెట్ బోర్డు వచ్చి సంవత్సరం అయింది. దాని ప్రభావం ఎంత ఉందో తెలపాలన్నారు. హైబ్రిడ్ సీడ్ వల్ల ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడాల్సి వస్తోంది. కేవలం రసాయన ఎరువుల వాడకం వల్ల సగటున ఒక్కో గ్రామం 16 లక్షల రూపాయలు విదేశాలకు కడుతోంది. ఎందుకు మనం మన మూలల్లోకి వెళ్లి రైతులకు మేలుచేసే అవకాశం వెతుక్కోకూడదో తెలపాలన్నారు.
గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ వైద్య శాఖ అధికారులు ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని కోరారు.
గుంతకల్ స్పిన్నింగ్ మిల్లు పునరుద్ధరణపై కమిటీ వేశారని, ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సివిల్ సప్లై కు సంబంధించి స్టాక్ పాయింట్ లను 12 నుంచి 5 కుదించారని, వాటిని పునరుద్ధరించాలని కోరారు.
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ భైరవాని తిప్ప ప్రాజెక్టు భూ సేకరణ సమస్యను పరిష్కరించాలని కోరారు.
సెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి ఇంకా స్థలం నిర్ణయించలేదని, వెంటనే నిర్ణయించాలన్నారు.
మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిర నియోజక వర్గానికి నీళ్లు ఇవ్వాల్సిన సమయంలో హిందూపురానికి నీళ్లు అందించారు.
మాకు నీటిని వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు. మడకశిర బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న నాలుగు మండలాలకు నీరు వెళ్లడంలేదని, వెంటనే నీరు అందించాలన్నారు.
అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల రైతులు వేరుశనగ పంట వంద శాతం నష్టపోయారు.. డీఆర్సీ ద్వారా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుదాం.. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలి..
2018 వరకు పెండింగ్ లో ట్రాన్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. ఈ ఏడాది PABR కుడి కాలువకు కేటాయించిన నీటిని ముందుగా ఇచ్చేలా చూడాలి..
కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మాట్లాడుతూ కదిరి ఆసుపత్రిలో సిబ్బంది తక్కువగా ఉండాలని, కదిరి, తనకల్లు సి హెచ్ సీలల్లో డాక్టర్లను నియమించాలన్నారు.
కదిరి ప్రాంతంలో వేరుశనగ రైతులు వర్షాల వల్ల నష్టపోయారని, దిగుబడి ఆధారంగా రైతులకు న్యాయం చేయాలన్నారు.
పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సత్యసాయి జయంతికి 2 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలన్నారు.
గ్రామాలలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, ఇసుకను ఎద్దుల బండ లో ఉచితంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అయినా పట్టుకుంటున్నారని, దీన్ని పరిష్కరించాలన్నారు. పుట్టపర్తిలో అనధికారిక లేఅవుట్స్ అధికంగా వేస్తున్నారని, దానిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా విద్యుత్ ట్రాన్ఫార్మర్లు, సబ్ స్టేషన్ల ఏర్పాటు అంశాన్ని అందరు ప్రజాప్రతినిధులు ప్రస్తావించారు.
ఈ అంశాలపై మంత్రి స్పందిస్తూ విద్యత్ అంశంలో గతంలో ఇరిగేషన్ మీటింగ్ తరహాలో ఏపిఎస్పిడిసిఎల్ సీఎండీ, విద్యుత్ శాఖా మంత్రి, కార్యదర్సులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, జిల్లాకు అవసరమైన విద్యుత్ అవసరాలను తీరుస్తామని ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు.
కిసాన్ రైలు ద్వారా ఉద్యాన ఉత్పత్తుల అమ్మకం వల్ల రైతులకు లాభం కలిగేలా మెకానిజం ను ఏర్పాటు చేయాలన్నారు.. తద్వారా రైతులతో విశ్వాసం పెంపొందించాలని మంత్రి సూచించారు.. పంట నష్టం, బీమా సమస్య ల పైన తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపుదామన్నారు..
ఇరిగేషన్ పై సమీక్షలో జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కాలువలకు గండి కొట్టి నీటిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స తెలిపారు. నీటి పంపిణీ కి సంబంధించి విజయవాడలో నిర్వహించిన ఇరిగేషన్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనల మేరకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కు మంత్రి బొత్స సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, సిరి, గంగాధర్ గౌడ్, పెనుగొండ సబ్ కలెక్టర్ నిషా0తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.