శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్
1 min readతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరితోపాటు రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు.
అనంతపూర్ లైవ్ న్యూస్.తిరుమల ,24.11.2020 :-
రాష్ట్రపతి మంగళవారం మధ్యాహ్నం తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలుదేరి క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహస్వామివారి దర్శనం చేసుకున్నారు.
అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి అహ్వానం పలికారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకస్వాములు వారికి స్వామివారి శేషవస్త్రం అందజేశారు.
అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఛైర్మన్, ఈవో కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని, 2021 క్యాలెండర్, డైరీని రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి, కలెక్టర్ శ్రీ భరత్ నారాయణ గుప్తా, డిఐజి శ్రీ క్రాంతిరాణా టాటా, టిటిడి సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్‌పి శ్రీ రమేష్‌రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
జి.హిమబిందు,
రిపోర్టర్,
అనంతపూర్ లైవ్ న్యూస్,