Anantapur Live News

www.anantapurlivenews.com

నూతన సంవత్సర శుభవేళ జిల్లా అధికార యంత్రాంగానికి శుభాకాంక్షలు..

1 min read

 

కోటి ఆశలు.. కొంగ్రొత్త ఆశయాలు.. బలీయమైన సంకల్పంతో నూతన సంవత్సరం లోకి అడుగిడుతున్న వేళ.. 2020 సంవత్సరం లో టీం అనంతపురం ‘అనంత’ ను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో అగ్రస్థానంలో నిలబెట్టినందుకు ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను..

గడిచిన ఏడాదిలో జిల్లా ప్రజలు, జిల్లా అధికార యంత్రాంగం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. సవాళ్ళపై యుద్ధంలాంటి పోరాటం జరిపి విజయవంతంగా బయట పడేందుకు, సమస్త ప్రజానీకానికి మేమున్నామని భరోసా ఇచ్చి నిర్భయంగా సేవలందించిన జిల్లా అధికార యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నాను.

2020 సంవత్సరం సమస్త ప్రపంచానికి, మానవాళి మనుగడ ప్రశ్నార్థకం చేసిన కరోనా (కోవిడ్) వైరస్ లాంటి విపత్కర పరిస్థితి ఎదురైంది. జిల్లాలో కోవిడ్ కట్టడిలో ప్రతి ఒక్క జిల్లా అధికారి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ను అమలు చేసి విజయం సాధించారు.. శాంపిల్ కలెక్షన్స్ , కోవిడ్ సెంటర్ల నిర్వహణ, కోవిడ్ ఆస్పత్రులలో వైద్య సేవలు అందించడం, కాంటాక్ట్ ట్రేసింగ్ సకాలంలో చేయడం, రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక కోవిడ్ టెస్టులు చేయడం లాంటి ప్రతి అంశంలో నిబద్ధతతో పని చేయడం జరిగిందని, భయంకర పరిస్థితుల్లో నిర్భయంగా సేవలు అందించడం పట్ల ప్రత్యేకంగా ప్రతి శాఖ అధికారిని, సిబ్బందిని అభినందిస్తున్నాను. ప్రపంచమంతా, దేశమంతా కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలో సేవలందించడంలో ఇబ్బందులు పడుతున్న సమయంలో జిల్లా యంత్రాంగం అవిరళ కృషితో జిల్లాలో కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను.

2020 ఏడాది అక్షర క్రమంలోనే కాదు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటు పడడం జరిగింది. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాల నియామకం, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలందించడం, రైతులకు సకాలంలో విత్తనాలు సరఫరా చేయడం, ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజల గడప వద్దకే అందించడం లో టీం అనంతపురం సమష్టి కృషితో పనిచేశారు.

అనంత జిల్లా ఉద్యాన పంటలకు పెట్టింది పేరు.. ఇక్కడ ఉద్యాన పంటలు ఎక్కువగా పండుతాయి.. కానీ రైతు పడ్డ కష్టానికి సరైన గిట్టుబాటు ధర రావడం లేదని భావించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అనంత నుంచి ఢిల్లీకి ఉద్యాన ఉత్పత్తులతో ప్రత్యేకంగా కిసాన్ రైలు ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలోనే ఇది రెండవ కిసాన్ రైలు కావడం విశేషం. కిసాన్ రైలును విజయవంతంగా అనంత నుంచి ఢిల్లీకి పంపించేందుకు ఎంతగానో కృషి చేసిన సంబంధిత ఉద్యాన శాఖ క్షేత్రస్థాయి, జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను.

బాలికలకు పెద్దపీట వేయాలని, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలనే లక్ష్యం తో “బాలికే భవిష్యత్” పేరుతో దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని ప్రతి శాఖ పరిధిలో బాలికలను ఒకరోజు అధికారిగా నియమించడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నాను.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కింద సకల సౌకర్యాలతో లేఔట్ లు తయారు చేయడం, ఇంటి పట్టాల పంపిణీ పకడ్బందీగా చేపట్టారు.. ఇందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు.

జిల్లా అభివృద్ధి కోసం కష్టపడి పని చేస్తూ అహర్నిశలు తోడ్పాటునందిస్తున్న టీం అనంతపురంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు జిల్లాను 2021 నూతన సంవత్సరంలో కూడా మరింత ముందుకు తీసుకు వెళ్లి, అనంతను అగ్రస్థానంలో నిలబెట్టాలని, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందజేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

మీ
గంధం చంద్రుడు, ఐఏఎస్
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్,
అనంతపురం

लाइव कैलेंडर

December 2020
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

LIVE FM सुनें

ADS 2020