నకిలీ బంగారు నాణేలతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా పట్టివేత
1 min readనకిలీ బంగారు నాణేలతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా పట్టివేత
* ముగ్గురు అరెస్టు …రూ 10,00,000/- నగదు, కారు, బైకు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం
నకిలీ బంగారు నాణేలతో తెలంగాణ వాసులను మోసం చేసిన కర్నాటకకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గుర్ని అరెస్టు చేసి వీరి నుండి రూ. 10,00,000/- నగదు, కారు, బైకు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాలతో అనంతపురం రూరల్ సి.ఐ మురళీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
** అరెస్టయిన ముఠా సభ్యుల వివరాలు:
1) కె.విజయకుమార్, వయస్సు, 23 సం., మాచెహళ్లి కొరచరహట్టి,హర్పనహళ్లి తాలూకా, దావణగెరె జిల్లా, కర్నాటక రాష్ట్రం
2) కె.జె.అశోక్ , వయస్సు 35 సం., మాచెహళ్లి కొరచరహట్టి,హర్పనహళ్లి తాలూకా, దావణగెరె జిల్లా, కర్నాటక రాష్ట్రం
3) ఎస్ దివాకర్ @ కుమార్ , వయస్సు 23 సం., మాచెహళ్లి కొరచరహట్టి,హర్పనహళ్లి తాలూకా, దావణగెరె జిల్లా, కర్నాటక రాష్ట్రం
** స్వాధీనం చేసుకున్నవి:
* రూ. 10,00,000/- నగదు, కారు, బైకు, 3 సెల్ ఫోన్లు
** నేపథ్యం: ప్రస్తుతం అరెస్టయిన ముగ్గురు మంచి స్నేహితులు. వీరికి తాగుడు, తదితర వ్యసనాలు ఉన్నాయి. ఈ వ్యసనాలను తీర్చుకోవాలంటే సరిపడా డబ్బులు లేవు. ఈక్రమంలో సులువుగా డబ్బు సంపాదించాలని భావించారు. ప్రత్యేకంగా పథకం వేశారు. పొలం, ఇళ్ల పునాదుల తవ్వకాలలో బంగారు నాణేలు దొరికాయని.. వీటిని తక్కువ ధరలకే విక్రయిస్తామని ముందుగా సేకరించుకున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి అమాయకులైన ప్రజలకు మాయమాటలు చెప్పసాగారు. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా బాజకుంట గ్రామానికి చెందిన పి. పరమేష్ , మహేష్ లను ఫోన్లలో నమ్మించారు. వీడియో కాల్ ద్వారా ఒక ఒరిజినల్ బంగారు నాణేన్ని చూయించారు. ఇది నిజమని భావించి కిలోన్నర నాణేలు రూ. 10 లక్షల ప్రకారం మాట్లాడుకున్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం 14.01.2022 వ తేదీ మహేష్ , పరమేష్ లకు ఫోన్ చేసి కురుగుంట వైఎస్‌ఆర్ కాలనీ కి రమ్మని చెప్పారు. అనుకున్న విధంగానే అందరూ సకాలంలో కురుగుంటకు చేరుకున్నారు. తెల్లని గుడ్డ సంచి ఇచ్చి అందులో ఉన్న బంగారు నాణేలు చెక్ చేసుకోమని ముఠా సభ్యులు చెప్పారు. నాణేలు బంగారువి కాదని నిర్ధారించుకుని నిలదీశారు. అసలు విషయం తెలిసిపోయిందని భావించి వారి చేతిలో ఉన్న నగదు, సెల్ ఫోన్ లను ముఠా సభ్యులు లాక్కొని హోండా షైన్ బైకులో ముగ్గురు పరారయ్యారు. ఈ మోసంపై అనంతపురం రూరల్ స్టేషన్ లో క్రైమ్ నం. 16/2022 u/s 420,379 r/w 34 IPC మేరకు కేసు నమోదు చేశారు.
** అరెస్టు ఇలా: నకిలీ బంగారు నాణేలతో మోసం చేసే ముఠాలపై ప్రత్యేక నిఘా వేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో ఇన్ఛార్జి డీఎస్పీ ప్రసాదరెడ్డి పర్యవేక్షణలో అనంతపురం రూరల్ సి.ఐ మురళీధర్ రెడ్డి, ఎస్సైలు మహనంది, నభీరసూల్ , ఏఎస్సై వెంకటేష్ …కానిస్టేబుళ్లు పోలా రమేష్ , యు.రమేష్ , జయకర్ , కమల్ బాషా, అనిల్ , శేఖర్ లు బృందంగా ఏర్పడి ప్రత్యేక నిఘా వేశారు. పక్కా రాబడిన సమాచారంతో ముగ్గురు ముఠా సభ్యులు నకిలీ నాణేలతో మోసాలకు పాల్పడిన ఈ ముఠాను స్థానిక CRIT కళాశాల వద్ద పట్టుకున్నారు.
** ప్రశంస: నకిలీ నాణేలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఈ ముఠాను పట్టుకున్న అనంతపురం రూరల్ సి.ఐ మురళీధర్ రెడ్డి, ఎస్సైలు మహనంది, నభీరసూల్ , ఏఎస్సై వెంకటేష్ …కానిస్టేబుళ్లు పోలా రమేష్ , యు.రమేష్ , జయకర్ , కమల్ బాషా, అనిల్ , శేఖర్ ల బృందాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS అభినందించారు.