గవర్నర్ తమిళి సై సీరియస్… విద్యార్థుల ఆందోళనలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని వీసీని ఆదేశించారు
1 min readయూనివర్శిటీలకు చాన్సలర్ గవర్నర్. తెలంగాణ గవర్నర్ ఈ అంశంలో తన అధికారాలు కూడా వినియోగించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఆర్జీయూకేటీలో దాదాపుగా ఎనిమిది వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. వేలాది మంది విద్యార్థులు మెయిన్ గేటు వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా విపక్ష నేతలు, తల్లిదండ్రులు గేటు బయట ఆందోళనకు దిగారు. బాసరకు వచ్చే రహదారుల్లో భారీగా పోలీసులు మోహరించారు. క్యాంపస్ నుంచి విద్యార్థులు బయటకు రాకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉండటంపై ఆ యూనివర్శిటీ చాన్సలర్ అయిన గవర్నర్ తమిళి సై సీరియస్ అయ్యారు. విద్యార్థుల ఆందోళనలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని వీసీని ఆదేశించారు. అయితే తమిళి సై ఆదేశాలను వీసీ పట్టించుకునే పరిస్థితి లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పబ్ లో జరిగిన అత్యాచార కేసు గురించి కూడా తమిళిసై నివేదిక అడిగారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించేందుకు ఆమెకు అధికారం ఉంది. విభజన చట్టం సెక్షన్ 8 ఆ అధికారాలు ఇస్తోంది.
అయితే ప్రభుత్వానికి ఇలాంటి నివేదికలు గవర్నర్‌కు పంపడం ఇష్టం లేదుకాబట్టి ఎవరూ పంపించలేదు. ఇప్పుడు చాన్సలర్ హోదాలో ఆదేశించినా ఆర్జీయూకేటీ వీసీ ఈ విషయాన్ని పట్టించుకునే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ తమిళిసై మాత్రం ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. కానీ పట్టించుకునేవాళ్లే ఉండటం లేదు.