సచివాలయ వ్యవస్థ వినూత్నం…ఆదర్శం
1 min read
సచివాలయ సేవలు అద్భుతం.. కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ప్రియాంకా మేరీ ఫ్రాన్సిస్
రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ అమలు తీరును అధ్యయనం చేసేందుకు జిల్లాలో పర్యటించిన కర్ణాటక రాష్ట్ర అధికార బృందం
బృందంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు, ఇద్దరు డైరెక్టర్లు, ఒక జాయింట్ డైరెక్టర్, క్షేత్ర స్థాయి అధికారులు
సోమందేపల్లి, చిలమత్తూరు మండలాల్లో గ్రామ సచివాలయ వ్యవస్థను పరిశీలించిన అధికారులు
అనంతపురం, నవంబర్ 27: రాష్ట్రంలో అమలవుతున్న సచివాలయ వ్యవస్థ వినూత్నంగా, ఆదర్శంగా ఉందని, సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న తీరు అద్భుతమని కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, ఐఏఎస్ అధికారి ప్రియాంకా మేరీ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ అమలు తీరును అధ్యయనం చేసేందుకు శుక్రవారం కర్ణాటక ప్రభుత్వం తరఫున కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, ఐఏఎస్ అధికారి ప్రియాంకా మేరీ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో అధికారుల బృందం జిల్లాలో పర్యటించింది.
కమిషనర్ తో పాటు మరో ఐఏఎస్ అధికారి ,బళ్లారి జిల్లా పరిషత్ సీఈవో నందిని, పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం డైరెక్టర్ రేవణప్ప, కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ రిసోర్స్ సెంటర్ డైరెక్టర్ యాలక్కి గౌడ, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ జాయింట్ డైరెక్టర్ గణేష్ ప్రసాద్,పంచాయతీ అభివృద్ధి అధికారులు,ప్లానింగ్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ అధికారులు మొత్తం 10 మంది ఈ బృందంలో ఉన్నారు.
సోమందేపల్లి మండలంలో గ్రామ సచివాలయం -3, చిలమత్తూరు గ్రామ సచివాలయం-1, రైతు భరోసా కేంద్రాలను అధికారుల బృందం పరిశీలించింది.
సచివాలయ వ్యవస్థ, పనితీరును తెలుసుకుని వారు ఆశ్చర్య పోయారు.. ఒక గ్రామ సచివాలయంలో ఇంత మంది పనిచేస్తున్నారా అని వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు.. పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఏఎన్ఎం, అగ్రికల్చరల్ అసిస్టెంట్, హార్టికల్చరల్ అసిస్టెంట్,విఆర్వో, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, గ్రామ వాలంటీర్ల తో మాట్లాడారు.. వారు ఏ విధంగా ప్రజలకు సేవలు అందిస్తున్నా రో అడిగి తెలుసుకున్నారు..
సేవలు అద్భుతం..ప్రజలకు ఉపయోగకరం
గ్రామ,వార్డ్ సచివాలయ వ్యవస్థ చాలా పెద్ద వ్యవస్థ అని, లక్షల మంది యువత ఈ వ్యవస్థ లో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించడం తమని బాగా ఆకట్టుకుందంటూ స్పందించారు. ఈ వ్యవస్థ అద్భుతంగా ఉందని, ప్రజలకు చాలా ఉపయోగకరమని వారు అభిప్రాయపడ్డారు. మండలాలకు,జిల్లా కేంద్రానికి వెళ్లే అవసరం లేకుండా గ్రామ స్థాయిలోనే ప్రజలకు సేవలు అందించడం చాలా బాగుందని కితాబిచ్చారు.
సాఫ్ట్వేర్ అద్భుతం
నిర్దేశించిన గడువు లోపే సేవలందించేలా సీఎం స్థాయి వరకు పర్యవేక్షిస్తున్న విధానం, అందుకోసం రూపొందించిన సాఫ్ట్వేర్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
- సచివాలయ పరిధిలో ఉన్న కుటుంబాల డేటా సేకరణ, మ్యాపింగ్ ఎలా చేశారు, సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫర్నిచర్, కంప్యూటర్స్ తదితర అన్ని అంశాల గురించి జాయింట్ కలెక్టర్ ( గ్రామ,వార్డ్ సచివాలయాలు, అభివృద్ధి) ఏ.సిరి తో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు..సిబ్బంది జీత భత్యాలు, నిర్వహణ కయ్యే ఖర్చు, సచివాలయాల ద్వారా అందుతున్న సేవలు తదితర అన్ని అంశాలను కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు..కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అమలు చేయాలన్న ఆలోచనతో ఉందని, అందువల్లే సచివాలయ వ్యవస్థ పనితీరును గురించి తెలుసుకునేందుకు అనంతపురం జిల్లాలో పర్యటించామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బృందం వెంట డిపివో పార్వతి ఉన్నారు.